కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం
- కృష్ణా నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటాం
- ప్రక్క రాష్ట్రం నీటి తరలింపుకు బీయర్ఎస్ సహకరించింది
- రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
- తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కృష్ణా నది నీటిని సమృద్ధిగా వినియోగించు కొనేందుకు తెలంగాణ ప్రజా
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్
హయంలో చేసిన అసంబద్ద చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం కలిగిందన్నారు. కృష్ణ, గోదావరి నదుల్లో
తెలంగాణ వాటా సాధించేందుకు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస
రెడ్డి,
జిల్లా
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి పాలేరు
రిజర్వాయర్ నుండి నాగార్జున సాగర్ లెఫ్ట్ లాల్ బహదూర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు
సాగు నీరు విడుదల చేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క
మాట్లాడుతూ శ్రీశైలం వద్ద రాయలసీమ ప్రాజెక్టు నిర్మించడం వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు
జోన్ 1,
2
ప్రాంతాలు ఇబ్బందులకు గురవుతాయని పదే పదే చెప్పినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం
వహించిందన్నారు. ఏపి ప్రభుత్వం శ్రీశైలం నుంచి రోజుకు 11 టిఎంసీల నీటిని తరలించేందుకు
గత ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. కృష్ణ నది పై పెండింగులో వున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా,కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, ఎస్.ఎల్.బీ.సీ. వంటి
ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు
నూతనంగా నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
2.53 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ పరిధిలోని 2 లక్షల 53 వేల ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశామన్నారు. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, నాగార్జునసాగర్ ప్రధాన కాలువ, అనేక యూ.టి. లు కొట్టుకు పోయాయని, వాటిని యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించామని తెలిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని 5 రోజుల్లో పూర్తి గా విడుదల చేస్తామని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల15 రోజుల ముందుగానే వరద ప్రవాహం వచ్చిందన్నారు. రైతును రాజును చేసేందుకు ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ పూర్తి చేసామని, గత ప్రభుత్వం10 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తే ప్రజా ప్రభుత్వం ఆ సహాయాన్ని 12 వేల రూపాయలకు పెంచి 9 రోజుల్లో 9 వేల కోట్ల విడుదల చేసిందన్నారు. వరి పంటను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాళ్ కు 500 రూపాయల బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment